Showing posts with label Skin Care. Show all posts
Showing posts with label Skin Care. Show all posts

Thursday, 26 January 2017

చేతులకు రాయండి తేనె!

చేతులకు రాయండి తేనె!
ఈ కాలంలో ముఖ సౌందర్యం మీదే కాదు.. చేతుల సంరక్షణపైనా దృష్టి పెట్టాలి. అప్పుడే అవి పొడిబారకుండా ఉంటాయి.
నూనె చర్మానికి తేమను అందిస్తుంది. అందుకే స్నానానికి ముందూ, తరవాతా చేతులకు ఆలివ్‌ లేదా కొబ్బరినూనె రాసుకోవాలి.
ఆలివ్‌నూనె, చక్కెర కలిపి చేతులకు రాసుకుని కాసేపయ్యాక కడిగేస్తే అవి మృదువుగా మారతాయి. సమపాళ్లలో చక్కెరా, ఆలివ్‌ నూనె కలిపి చేతులకు రాసి, రెండు నిమిషాల పాటు మర్దనా చేసి తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే చేతులపై ఉండే మృతచర్మం పోయి.. అవి మృదువుగా మారతాయి.
తేనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. చెంచా తేనె, అరచెంచా ఆలివ్‌ నూనె, కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి చేతులకు రాసి గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
చెంచా అరటిపండు గుజ్జుకు, అరచెంచా చొప్పున తేనె, ఆలివ్‌నూనె కలిపి చేతులకు రాయాలి. పది నిమిషాలయ్యాక శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది.

ఏదో ఒకటి వాడేయకండి!

ఏదో ఒకటి వాడేయకండి!
ఈ కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య చర్మం పొడిబారడం. దానికి ఏదో ఒక క్రీం రాసుకోవడం కన్నా.. ఆ సమస్యకు అసలైన కారణం తెలుసుకునే ప్రయత్నం చేయాలి.
ల్లగా ఉందని వేడివేడి నీళ్లతో స్నానం చేస్తుంటే మానేయండి. ఆ వేడి చర్మం తేమని లాగేస్తుంది. దాంతో పొడిబారుతుంది. బదులుగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి.
చర్మం బాగా పొడిబారినప్పుడో.. గుర్తొచ్చినప్పుడో తప్ప మాయిశ్చరైజర్‌ రాసుకోరు కొందరు. మీరు ఆ పొరపాటు చేస్తున్నారేమో గమనించుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు మాయిశ్చరైజర్‌ రాసుకోవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. మరేం చేయాలంటారా.. స్నానం చేసిన వెంటనే చర్మం తడిపొడిగా ఉన్నప్పుడే మాయిశ్చరైజర్‌ రాయాలి. పొడిబారే సమస్య అదుపులో ఉంటుంది.
అవసరానికి మించి ముఖానికి స్క్రబ్‌ వాడుతున్నా.. రకరకాల ప్రయోగాలు చేస్తున్నా కూడా చర్మం పొడిబారుతుంది. అందుకే ఓ పని చేయండి. రెండు చెంచాల చక్కెరలో కాస్త కొబ్బరి లేదా ఆలివ్‌నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాలయ్యాక కడిగేయాలి.
సబ్బుల్లోని రసాయనాలూ ఈ సమస్యకు కారణం అవుతాయి. కాబట్టి మీ చర్మతత్వానికి సరిపోయే ఫేస్‌వాష్‌ని నిపుణుల సలహాతో ఎంచుకోండి. మార్పు కనిపిస్తుంది.

తరచూ ముఖం కడిగేస్తున్నారా!

తరచూ ముఖం కడిగేస్తున్నారా!
కొందరికి తరచూ ముఖం కడుక్కునే అలవాటు ఉంటుంది. అది మంచిదే కానీ.. అలా కడుక్కుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలూ కొన్ని ఉన్నాయి.
ముఖం కడుక్కోవడానికి ముందు తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. లేదంటే చేతులకున్న బ్యాక్టీరియా, ఇతర క్రిములు చర్మంలోకి వెళ్లిపోయి మొటిమలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
మేకప్‌ వేసుకునే అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా దాన్ని తొలగించుకున్నాకే ముఖం కడుక్కోవాలి. మేకప్‌ వేసుకున్నప్పుడు చర్మగ్రంథులు తెరచుకుని ముఖం మీద ఉన్న క్రిములన్నీ లోపలికి చేరి చర్మ సమస్యలు వస్తాయి. అందుకే దాన్ని ముందు క్లెన్సర్‌తో తొలగించుకుని, తరవాత ఫేస్‌వాష్‌తో కడగాలి.
ఈ కాలంలో స్నానానికే కాదు... ముఖం కడుక్కోవడానికి కూడా చాలామంది వేణ్నీళ్లని వాడతారు. ఇలా చేస్తే చర్మం పొడిబారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముఖానికి మాత్రం చన్నీళ్లనే వాడాలి.
చలికాలంలో చర్మాన్ని గట్టిగా రుద్దకూడదు. పొడిబారిన చర్మాన్ని స్క్రబ్‌లు ఇంకా ఇబ్బంది పెడతాయి. వాటిని వారానికోసారి ఉపయోగిస్తే చాలు. అలానే రోజూ రెండుసార్లకు మించి ఫేస్‌వాష్‌ కూడా వాడకూడదు.
పొడి చర్మం ఉన్నవారు మాత్రం ముఖం కడుక్కున్న ప్రతిసారీ మాయిశ్చరైజర్‌, కాస్త కొబ్బరినూనె రాయాలి. లేదంటే చర్మం పొడిబారే సమస్య ఇంకా పెరుగుతుంది.