Sunday 29 January 2017

అదిరింది.. జంప్‌సూట్‌!

అదిరింది.. జంప్‌సూట్‌!
కళాశాలకు.. జీన్స్‌ప్యాంటూ, చొక్కా లేదా కుర్తీ.. వేడుకలకు.. అయితే సంప్రదాయ దుస్తులు.. లేదా గౌన్లు, స్కర్టుల్లాంటివాటికి ప్రాధాన్యం ఇస్తారు అమ్మాయిలు. కానీ ఎప్పుడూ అవేనా...అందుకే ఈసారి జంప్‌సూట్లను ఎంచుకుని చూడండి. ఆపాదమస్తకం ఒకే డిజైనుతో ఉండే ఈ వస్త్రశ్రేణి అందమే వేరు. ఎలాగో వివరిస్తున్నారు స్టైలిస్ట్‌ నిర్లిప్తా రెడ్డి.
పాప్‌ సంగీతపు హోరుతో వూపిరిపోసుకుంది జంప్‌సూట్‌..ఒకప్పుడు ఫ్యాషన్‌గా అమ్మాయిల మనసు దోచిన ఈ వస్త్రశ్రేణి ఇప్పుడు మళ్లీ ఆకట్టుకుంటోంది. వేడుకలకే కాదు..కాలేజీలకూ, కార్యాలయాలకు వేసుకునేలా తయారైంది. దీన్ని ప్లే సూట్‌ అనీ, రాంపర్‌ అనీ అంటారట. .పాప్‌ సంస్కృతి మొదలైనప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ ఆహార్యం ఇప్పటికీ స్థిరంగా ఉండి.. ఎప్పటికప్పుడు మార్పు చేర్పులతో ఫ్యాషన్‌ ప్రపంచంలో తనదైన స్థానాన్ని పదిలం చేసుకుంది. మరి దాన్ని ఎంచుకునే ముందు.. ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో చూద్దాం.
వస్త్రానికి ప్రాధాన్యం..
నడుము భాగం తీరైన ఆకృతిలో కనిపించేలా చేయడం దీని ప్రత్యేకత. కాబట్టి మొదట జంప్‌సూట్‌ని ఎంచుకునేప్పుడు ఎలాంటి వస్త్రంతో తయారైందని గమనించాలి. ఇది సాధారణంగా ఆపాదమస్తకం ఒకే తరహా వస్త్రంతో ఉంటుంది. సిల్కు అయితే ఒంటికి అతుక్కుపోయినట్లు ఉంటుంది కాబట్ట అసౌకర్యంగానూ ఉంటుంది. అందుకే లెనిన్‌, నూలు, వూలు డెనిమ్‌ వస్త్రాలతో తయారుచేసినవే జంప్‌సూట్‌కి అనుకూలం. శాటిన్‌, సిల్కు వంటివాటిని ఏదైనా ప్రత్యేక సందర్భంలో ఏ కొద్దిసేపో వేసుకునేప్పుడు ఎంచుకోవచ్చు. దీనికి సాధారణంగా ఎలాస్టిక్‌ ఉంటుంది. లేదంటే అదే వస్త్రంతో రూపొందించిన బెల్ట్‌ ఉండొచ్చు. అవేవీ లేనప్పుడు మెటాలిక్‌, ఫంకీ బెల్ట్‌లను ఉపయోగించొచ్చు. అప్పుడే దాని తీరు, శరీరాకృతీ స్పష్టంగా తెలుస్తుంది.
నిలువు గీతలుండేలా...
* డిజైను బాగుందని కాకుండా.. శరీరాకృతిని బట్టి ఎంచుకుంటే ఆ అందమే వేరు. ముఖ్యంగా కాస్త ఎత్తు తక్కువగా ఉన్నవాళ్లు...నిలువు గీతలున్నవాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.
* కొందరికి నడుము పై భాగం చిన్నగా, కాళ్లు పొడుగ్గా కనిపిస్తాయి. ఇలాంటివారికి ఛాతిభాగం వెడల్పుగా ఉన్న రకాన్ని వేసుకోవాలి. అప్పుడే పొడుగ్గా కనిపిస్తారు.
* భుజాలూ, ఛాతిభాగాలు వెడల్పుగా ఉన్నవారు జంప్‌సూట్ల మెడ ఆంగ్ల ‘వి’ ఆకృతిలో ఉండేలా చూసుకోవాలి. ఇలాంటివారికి పై భాగం ఒకదానిమీద మరొకటి పట్టీల్లా ఉన్నవీ (క్రాస్‌ఓవర్‌) నప్పుతాయి. వీటిని ఎంచుకుంటే ఎదుటివారి దృష్టి భుజాలూ, ఛాతీ కాకుండా మెడభాగంపై పడుతుంది.
* ఎత్తు తక్కువగా ఉన్నవారు ఈ వస్త్రశ్రేణిని వేసుకుంటున్నప్పుడు ప్యాంటు అడుగున వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి. ఎత్తుమడమల చెప్పులూ వేసుకోవాలి.
* కార్యాలయాలకు వెళ్తున్నప్పుడు దీనిపై జాకెట్‌ కానీ, కోటు కానీ వేసుకుంటే ఆ అందమే వేరు.
* ఈ వస్త్రశ్రేణి అడుగు భాగంలో చూపించాల్సిన మార్పులు తక్కువే ఉంటాయి కాబట్టి శరీర పై భాగం మన శరీరాకృతికి తగ్గట్లుగా డిజైను చేయించుకోవాలి. అంటే వీపుభాగం లేని (బ్యాక్‌లెస్‌), చేతులు లేకుండా కేవలం మెడభాగం మాత్రమే ఉండే (ఆల్టర్‌ నెక్‌)లా కుట్టించుకోవచ్చు.
* లావుగా ఉన్నవారు మరీ వదులుగా, శరీరానికి మరీ పట్టేసినట్లుగా లేకుండా చూసుకోవాలి. కుదిరితే పై భాగం అతికినట్లు ఉండి.. అడుగున కాస్త వెడల్పుగా ఉండేలా చూసుకోవాలి.
* మరీ పెద్ద పెద్ద డిజైన్లలో ఉండేవి ఎవరికీ పెద్దగా నప్పవు. కాబట్టి బదులుగా రూపం అంటూ లేని ప్రింట్లు, గళ్లు,, చిన్న డిజైన్లు...వేసుకోవాలి.
* ఈ వస్త్రశ్రేణి ఇప్పుడు పార్టీలకు అనుగుణంగా కూడా అందుబాటులోకి వచ్చింది. ఇలాంటప్పుడు మెడ భాగంలో పూసలు ఉండేలా చూసుకోవాలి. వీటి మీదకు ఫంకీ జ్యూయలరీ, క్లచ్‌, స్టేట్‌మెంట్‌ నగలు చక్కగా నప్పుతాయి. వీటిని ఎలాంటి వేడుకలో అయినా హాయిగా వేసేసుకోవచ్చు. మొదటిసారి ఈ వస్త్రశ్రేణిని వేసుకోవాలనుకునేవారు. టీనేజీ వయసు దాటిన అమ్మాయిలూ నలుపూ తెలుపుల్లో, లేదంటే ఏక రంగులో ఉండే జంప్‌సూట్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు.

No comments:

Post a Comment