Sunday 29 January 2017

జీనూప్యాంటూ వేస్తే బుల్లెమ్మో!

జీనూప్యాంటూ వేస్తే బుల్లెమ్మో!
ఈతరం అమ్మాయి అల్మారా తెరిస్తే... కనీసం పది, పదిహేను జీన్స్‌ప్యాంట్లు కనిపిస్తాయి. మీకు ఇష్టమైన, సౌకర్యంగా ఉండే దుస్తులు ఏవి? అని ఏ హీరోయిన్‌ను అడిగినా జీన్స్‌, టీషర్ట్‌ అనేస్తుంది ఠక్కున. ఎప్పటికప్పుడు ఫ్యాషన్‌ మారుతున్నా.. ఎవర్‌గ్రీన్‌ ట్రెండ్‌ ఏదన్నా ఉందంటే అది జీన్సే..దానికున్న ఆకర్షణ అలాంటిది! అందుకేనేమో ఇప్పుడిది కాలేజీ, కార్యాలయాల్లోనే కాకుండా పార్టీల్లోనూ కనిపిస్తోంది. అంతా బాగానే ఉంది...కానీ దాన్ని ఆకృతికి తగినట్లుగా, సందర్భానుసారంగా వేసుకోవడం కూడా తెలియాలిగా.. అంటున్నారు డిజైనర్‌ భక్తిరెడ్డి.
జీన్స్‌..అంటే నీలం రంగులో పొడుగ్గా ఉండే ప్యాంటు మాత్రమే అనుకుంటే పొరపాటు. సందర్భానికి తగ్గట్లు ఎంచుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాలు అందుబాటులోకి వచ్చేశాయి. చిరుగుల జీన్స్‌ (టోర్న్‌), పొట్టపైకి ఉండేవి (హైవెయిస్టెడ్‌), స్ట్రెచ్‌, బూట్‌కట్‌, ఫ్లేర్డ్‌, సిగరెట్‌, బాయ్‌ఫ్రెండ్‌, బ్యాగీ, స్కిన్నీ, యాంకిల్‌ కట్‌, క్రాప్డ్‌ జీన్స్‌...వంటివెన్నో ఉన్నాయి.
ఎవరికయినా స్ట్రెయిట్‌కట్‌.. జీన్స్‌లో రకాలెన్ని ఉన్నా....అన్నీ అందరికీ నప్పవు. ఎవరి శరీరాకృతికి తగినట్లుగా వారు ఎంచుకోవాలి. అందరికీ నప్పే రకం అంటే స్ట్రెయిట్‌కట్‌, యాంకిల్‌ లెంగ్త్‌ జీన్స్‌. వాటిల్లో స్లిమ్‌ఫిట్‌ని ప్రయత్నించొచ్చు.
కొంచెం సన్నగా అంటే నడుము, పిరుదుల భాగం లావుగా లేనివారు స్ట్రెచ్‌, బూట్‌కట్‌, బాయ్‌ఫ్రెండ్‌, బ్యాగీ, స్కిన్నీ.. ఇలా దేన్నైనా ఎంచుకోవచ్చు. కానీ నడుము కింది భాగం లావుగా ఉండేవారు స్ట్రెయిట్‌కట్‌ జీన్స్‌నే వేసుకోవాలి.
ఎత్తు తక్కువగా ఉన్నవారికి ఫ్లేర్డ్‌జీన్స్‌ నప్పదు. దీన్ని ఎంచుకోవడం వల్ల మరింత పొట్టిగా కనిపించే ఆస్కారం ఎక్కువే. వీరు స్కిన్నీ జీన్స్‌ ఎంచుకోవచ్చు. కాళ్లు, పొడుగ్గా , సన్నగా కనిపించేలా చేయాలనుకుంటున్నారా.. త్రీఫోర్త్‌ పొడవులో ఉండే క్రాప్డ్‌ జీన్స్‌ వేసుకుని చూడండి. దీనిమీదకు కోల్డ్‌ షోల్డర్‌ టాప్‌లు బాగుంటాయి. వీటికి జతగా ఎత్తు మడమల చెప్పులు వేసుకుంటే గనుక లుక్కే మారిపోతుంది. అయితే అది కాళ్లకు పట్టేసినట్లు ఉండాలే తప్ప వదులుగా కాదు. యాంకిల్‌ లెంగ్త్‌ కూడా బాగుంటుంది.
పొట్ట ఉన్నవారికీ, కాస్త లావుగా ఉన్నవారికి హైవెయిస్టెడ్‌ జీన్స్‌ చక్కగా నప్పుతుంది. కొందరిలో పొట్ట, తొడలు, కాళ్లు లావుగా ఉండి ఓ ఆకృతి ఉండదు. ఇలాంటివారు తమ శరీరాకృతిని సన్నగా కనిపించేలా చేయాలనుకుంటే.. బాయ్‌ఫ్రెండ్‌ జీన్స్‌, స్ట్రెయిట్‌ ఫిట్స్‌, బూట్‌కట్‌ బాగా నప్పుతాయి. వీరు ముదురు రంగుల్లో ఉండే జీన్స్‌ని ఎంచుకుని వాటిమీదకు లేత రంగుల్లో ఉండే టాప్‌లను వేసుకోవాలి. లేదంటే కుర్తాలు, కుర్తీలను జతగా చేసుకున్నా సరిపోతుంది.
అదే ట్రెండ్‌ ఇప్పుడు.. ఈ తరం అమ్మాయిలు ఒకప్పటి చిరుగుల జీన్స్‌నే మళ్లీ ఫ్యాషన్‌గా మార్చుకుంటున్నారు. కాస్త పాలిపోయినట్లుగా ఉండే వాష్డ్‌ జీన్స్‌ కూడా ఇప్పుడు ఆమ్మాయిల మనసు దోచేస్తోంది. ఫ్లేర్డ్‌, క్రాప్డ్‌, స్కిన్నీ జీన్స్‌ వంటివి టీనేజీ అమ్మాయిలకు బాగుంటాయి. ఉద్యోగినులు దీన్ని ఎంచుకుంటుంటే అది ఫార్మల్‌ లుక్‌లో ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ముదురు నీలం, నలుపు వంటి రంగుల్లో జీన్స్‌ వేసుకుని జతగా పొడవు చేతులుండే లేత రంగుల చొక్కాలు ఎంచుకుంటే సరి. అలాగే ఎలాంటి డిజైను లేకుండా నలుపు, తెలుపు చొక్కాలూ బాగుంటాయి.
డెనిమ్‌ వస్త్రంతో తయారు చేసిన జెగ్గింగ్స్‌ కూడా ఇప్పుడు ఫ్యాషనే. సాగే గుణం కలిగిన ఇవి శరీరాకృతి చక్కగా కనిపించేలా చేస్తాయి. సౌకర్యవంతంగానూ ఉంటాయి.
జీన్స్‌కి జతగా టీషర్ట్‌, షర్టు, కుర్తీ, కుర్తాలే కాదు.. పొడుగ్గా చీలికలుండే మ్యాక్సీ టాప్‌లూ బాగుంటాయి. తాజాగా ‘‘ఏ దిల్‌హై ముష్కిల్‌’’లో అనుష్కశర్మ ఈ తరహానే ఎంచుకుంది.
ముప్షైల్లోపు ఉండే అమ్మాయిలు కాస్త లేత రంగుల్ని ఎంచుకోగలిగితే ఆపై వయసున్న వారికి ముదురు రంగు లైన నలుపు, నీలం జీన్స్‌ బాగుంటాయి.
ఎప్పుడూ నీలం, నలుపు రకాలేనా అనుకునేవారు ఎరుపు, గులాబీ, పసుపు వంటి రంగుల జీన్స్‌నూ ప్రయత్నించొచ్చు. వాటి మీదకు సాదా, ప్రింటెడ్‌ టాప్‌లు బాగుంటాయి. ప్రింటెడ్‌ జీన్స్‌ టీనేజీ అమ్మాయిలకు నప్పుతాయి. వీటిపై ఎలాంటి డిజైను లేని సాదా టాపుల్ని ఎంచుకుంటేనే అందం.
ఏదయినా పార్టీకి జీన్స్‌తో వెళ్లాలనుకుంటే కాస్త పాలిపోయిన రంగులో ఉండే తరహాకి (ఫేడెడ్‌ టోన్డ్‌) జతగా మెరుపుల టాప్స్‌ ప్రయత్నించాలి. అదే స్నేహితులతో సరదాగా బయటకు వెళ్తున్నప్పుడు టీషర్ట్స్‌, కఫ్తాన్‌, ట్యూనిక్‌ టాప్‌లు బాగుంటాయి. ఇంకాస్త భిన్నంగా కనిపించాలంటే జీన్స్‌పైకి క్రాప్‌ టాప్స్‌నీ ప్రయత్నించొచ్చు. అంటే ఇది కొద్దిగా పొట్టపైకి ఉంటుంది.

No comments:

Post a Comment