Friday 27 January 2017

వేపతో పూత వేద్దామా!

వేపతో పూత వేద్దామా!
ముఖాన్ని మెరిపించేందుకూ.. మొటిమలూ, మచ్చల్లాంటివి కనిపించకుండా చేసేందుకు రకరకాల పూతలు ప్రయత్నిస్తుంటాం కదా.. ఈసారి వేపను కూడా వాడి చూడండి. ఎందుకు అంటారా..

వేపాకుల్లో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు ఎక్కువ. స్నానం చేసే నీటిలో గుప్పెడు వేపాకుల్ని వేసి మరిగించండి. ఆ నీటితో స్నానం చేస్తే శరీరం నుంచి చెమట వాసన రాదు. మోచేతులూ, మెడా, మోకాళ్ల దగ్గరుండే బ్యాక్టీరియానూ నాశనం చేస్తుంది వేప.
చెంచా వేపాకుల ముద్దలో కొద్దిగా పసుపు కలపాలి. దీన్ని ముఖానికి రాసి.. బాగా ఆరిపోయాక కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే.. చర్మం మృదువుగా, ఆరోగ్యంగా మారడమే కాదు మచ్చల్లాంటివీ పోతాయి.
ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా... ముఖం జిడ్డుగా కనిపిస్తోందా. రెండుచెంచాల వేపాకులపొడిలో కొద్దిగా నిమ్మరసం, పెరుగూ కలిపి ముఖానికి రాసుకోండి. పదినిమిషాలయ్యాక కడిగేయండి. ఈ పూత ముఖంలోని అధిక జిడ్డును నివారిస్తుంది.
మెరిసే చర్మం సొంతం కావాలంటే.. చెంచా వేపాకులపొడిలో కొద్దిగా గులాబీపొడీ, పెరుగూ, పాలూ కలిపి పూతలా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
గిన్నెలో సగం వరకూ నీళ్లు తీసుకుని అందులో గుప్పెడు వేపాకుల్ని వేసి పొయ్యిమీద పెట్టండి. నీళ్లు మరిగి, ఆకులు రంగుమారాక దింపేయాలి. ఈ నీటిని చల్లార్చి వడకట్టి ఓ సీసాలోకి తీసుకుంటే సహజ టోనర్‌ తయారైనట్లే. ఇందులో దూదిని ముంచి.. ముఖం తుడుచుకుంటే మొటిమలూ, వాటి తాలూకూ మచ్చలూ దూరమవుతాయి.

No comments:

Post a Comment