Sunday 29 January 2017

అమ్మయినా.. అమ్మాయిలా!

అమ్మయినా.. అమ్మాయిలా!
పాపాయి పుట్టాక.. బరువు పెరగడం, లావుగా కనిపించడం సహజం. అలాని సన్నబడేవరకూ ఇంట్లోనే ఉండిపోలేం కదా! ఉద్యోగానికెళ్లాల్సి ఉంటుంది. వేడుకలకూ హాజరుకావాల్సి ఉంటుంది. మరి నలుగురిలో లావుగా కనిపించకుండా ఉండాలంటే.. దుస్తుల విషయంలో పాటించాల్సిన కిటుకులు తెలిసుండాలి. అవే వివరిస్తున్నారు డిజైనర్‌ వర్షమహేంద్ర....
ల్లైన తర్వాత ఫ్యాషన్లకు దూరంగా ఉండాలనుకోవడం అపోహే! ఇటు ఫ్యాషన్‌... అటు సౌకర్యం రెండింటినీ వదులుకోకుండా అందంగా ఎలా కనిపించవచ్చో చూద్దాం. సంప్రదాయ, పాశ్చాత్య వస్త్రశ్రేణి ఏదయినా సరే.. జాగ్రత్తగా ఎంచుకుంటే సన్నగా కనపడొచ్చు. అంతకుమించి కొత్తగా తల్లులయిన వారు పిల్లల్ని ఎక్కువ సేపు ఎత్తుకుని ఉండాల్సి వస్తుంది. ముఖ్యంగా చంటి పిల్లలకు పాలూ ఇవ్వాల్సి రావచ్చు. ఈ రెండు సమస్యలు దృష్టిలో పెట్టుకుని వస్త్రధారణ ఎంచుకోవాలి.
ఛాతీ పెద్దగా కనిపించడం, పొట్ట ముందుకు రావడం ఈ సమయంలో సహజంగా చోటు చేసుకునే మార్పులు. వీటికి అనుగుణంగా కూడా వస్త్రధారణలో మార్పులు చేసుకోవాలి. శరీరానికి పట్టేసినట్టు ఉండేవి కాకుండా కాస్త వదులుగా ఉండే దుస్తుల్ని వేసుకోవాలి. ట్యూనిక్‌ తరహా టాప్‌లు బాగుంటాయి. అయితే ముందువైపు బొత్తాములు ఉండే తరహావి ఎంచుకోవాలి. అప్పుడే పిల్లలకి పాలివ్వడం తేలిక అవుతుంది. ప్రస్తుత ట్రెండ్‌ కూడా అదే. బొత్తాములు ఇష్టం లేదు అంటారా అప్పుడు మెటాలిక్‌ జిప్పర్స్‌ ఉన్నవాటిని ఎంచుకోవచ్చు. ముచ్చటమైన జిప్‌లు ఆకర్షణీయంగానూ కనిపిస్తాయి.. పాలివ్వడానికీ సౌకర్యంగా ఉంటాయి. మరీ అంత లావుగా లేనివాళ్లు మెడభాగం కాస్త కిందకు (డీప్‌ వీ నెక్‌) ఉన్నవాటిని ఎంచుకుంటే సరిపోతుంది. మరి వీటికి కింద జతగా ఏం వేసుకోవాలని అంటారా? వదులుగా ఉండే పలాజోలు బాగుంటాయి. మోకాళ్లపైకి ఉండే ట్యూనిక్స్‌ (షార్ట్‌లెంగ్త్‌) ఎంచుకున్నప్పుడు సన్నగా ఉండే ప్యాంట్లు (న్యారో టైప్‌), ట్రౌజర్లూ, జెగ్గింగ్‌లూ వాడొచ్చు.
కొందరికి చీరలే సౌకర్యంగా అనిపిస్తాయి. చీరల్లో నూలూ, నేత రకాలు కట్టుకుంటే పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వాళ్లకే కాదు.. మీకూ సౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే తేలిగ్గా ఉండే సిల్క్‌చీరలు కూడా బాగుంటాయి. చిన్న చిన్న వేడుకలకు భారీ పనితనం లేకుండా ఖాదీ సిల్క్‌, అహింసా సిల్క్‌, లెనిన్‌ సిల్క్‌, తేలికపాటి టస్సర్‌ కట్టుకోవచ్చు. సన్నగానూ కనిపిస్తారు. సాధారణంగా చీరలు కట్టుకునేవారికి ఎదురయ్యే సమస్య బ్లవుజులు బిగుతు అయిపోవడం. అందుకని చీరలు కూడా పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. దీనికి చక్కని పరిష్కారం అంటే భిన్న రంగుల్లో ఉండే బ్లవుజులని జతగా కొనుక్కుని వేసుకోవడమే. చీరతో సంబంధం లేని భిన్న రంగుల్ని బ్లవుజుగా ఎంపిక చేసుకోవడం ఇప్పటి ఫ్యాషన్‌ కూడా. మీ మెడ పొడవుగా ఉంటే బోట్‌నెక్‌ కూడా అద్భుతమైన ఎంపిక అవుతుంది. ఛాతీ కనిపించకుండా ఉండేందుకు ఇది చక్కని పరిష్కారం. క్రాప్‌టాప్‌ తరహా బ్లవుజులు ఎంచుకుంటే ఫ్యాషన్‌గానూ ఉంటాయి. అయితే ఆయా సందర్భాలకు తగ్గట్లు కాంతిమంతమైన, ఆహ్లాదకరమైన రంగుల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ కంచిపట్టుని కట్టుకోవాల్సి వస్తే.. పొడవు చేతులున్న బ్లవుజులు మేలు.
ఉద్యోగాలకు వెళ్లేవారు అన్నిసార్లూ చీరలు కట్టుకోలేరు కాబట్టి వీరికి కుర్తాలు సరైన ఎంపిక. వీటిల్లోనూ ఇప్పుడు స్ట్రెయిట్‌ కట్‌, లూజ్‌కట్‌, ముందు భాగంలో చీలిక ఉన్నవీ (ఫ్రంట్‌ ఓపెన్‌) వస్తున్నాయి. కాస్త వదులుగా ఉండే ఈ కుర్తాలు పొట్ట కనిపించకుండా చేస్తాయి. కాలర్‌ కుర్తాలు కూడా బాగుంటాయి.
ఇలాంటివారు అన్ని సందర్భాల్లో దుపట్టాలే వాడాలని కాకుండా స్టోల్స్‌ కూడా వేసుకోవచ్చు. ఇవీ ఇప్పుడు రకరకాల డిజైన్లూ, రంగుల్లో దుస్తులకు తగ్గట్టుగా వస్తున్నాయి.
కాస్త భిన్నంగా కనిపించాలనుకునేవారికి షర్ట్‌టాప్‌లు బాగుంటాయి. కేప్‌, లేయర్డ్‌ డిజైనుల్లో ఉండే టాప్‌లూ కొత్తగా కనిపించేలా చేస్తాయి. కేవలం టీషర్టులు వేసుకోవాలనుకుంటే కొత్త లుక్‌ కోసం పొడుగ్గా లేదా పొట్టిగా ఉండే ష్రగ్స్‌ని ఎంచుకోవాలి.
పార్టీలకయితే చీరలూ లేదా సల్వార్‌, పలాజోలూ బాగుంటాయి. అవి వద్దనుకునేవారు పొడవాటి స్కర్టులూ లేదా మ్యాక్సీలనూ ఎంచుకోవచ్చు. ఇవి కూడా ఇప్పుడు రకరకాల వస్త్రాల్లో అందుబాటులోకి వచ్చాయి. కానీ చమ్కీలూ, పూసల వంటి డిజైన్లకు దూరంగా ఉంటేనే మంచిది.

No comments:

Post a Comment