Saturday 28 January 2017

ఆ తాతే తల్లిని చేశాడు

ఆ తాతే తల్లిని చేశాడు
ఏ ఆడపిల్లకీ ఆ పరిస్థితి రాకూడదు. ఏ అమ్మాయికీ అలాంటి ప్రశ్నలు ఎదరు కాకూడదు. పదమూడేళ్ల వయసులో తల్లి అవుతుం దని తెలిసిన రాణి (పేరు మార్చాం) తన తల్లి ముందే దోషిలా నిల్చుంది. తాను యాభై ఐదేళ్ల ముసలివాడి కోరికకు బలైందని తెలుసుకుని పులిలా పంజా విప్పింది. అంతేనా శిక్ష పడేవరకూ పోరాడుతూనే ఉంది. పరువు అని పట్టుకుని వేళ్లాడలేదు. అక్షరం ముక్కరాకపోయినా అమ్మాయిలంతా తనలానే ఆలోచించాలి అంటోందీ రాణి.

‘ఈ కడుపు ఎలా తెచ్చుకున్నావే’ అని అమ్మ ఆవేశంతో ­వూగిపోతూ అడిగింది. పదమూడేళ్ల వయసులో నాకు ఆ మాటలు అర్థం కాలేదు. ఆ పెద్దాసుపత్రిలో మా అమ్మ ఎందుకు ఏడుస్తూ అరుస్తోందో నా బుర్రకి ఎక్కట్లేదు. సమాధానం ఏంటో నాకే తెలియక బేలగా చూస్తుండిపోయాను. అది గమనించిన నర్సమ్మలు... మా అమ్మని గదిలోంచి బయటకు పంపారు. ‘నీ కడుపులో బిడ్డ ఉంది. ఆరో నెల గర్భవతివి’ అని అన్నారు. గర్భాన్ని తీసేసే పరిస్థితి కూడా దాటిపోయిందని చెప్పారు. అసలు నేను తల్లిని కావడం ఏంటో తెలియక గందరగోళంగా అనిపించింది. నాకు గర్భం ఎలా వస్తుందో కూడా తెలియదు. మరి సమాధానం ఏం చెబుతాను.
ఇంటికి వెళ్లాక అమ్మకి నన్ను ఎలా అడగాలో అర్థమైనట్టు లేదు. ‘ఎవరి పక్కన పడుకున్నావే’ అంటూ చావబాదింది. అప్పుడు అడిగాను మా అమ్మని.. కడుపు ఎందుకొస్తుందమ్మా అని. నాకే పాపం తెలియదని అర్థం చేసుకున్న అమ్మ అంతా చెప్పాక అసలు విషయం తెలిసింది. అందుకు కారణం ఎవరో కూడా యాదికొచ్చింది.
పెళ్లి చేయాలనుకుంది.. మాది రంగారెడ్డి జిల్లాలోని ఓ మారుమూల పల్లె. మా అమ్మకి నేను ఒక్కదాన్నే. నాన్న చిన్నతనంలోనే చనిపోయాడు. బడి మా ­వూరికి దూరమని అమ్మ నన్ను చదువుకోవడానికి పంపలేదు. ఇంట్లో పనులు చేసేదాన్ని. చుట్టుపక్కల వాళ్లందరికీ ఏదో ఒక సాయం చేస్తూ గడిపేసేదాన్ని. అంతేకాదు నాకు మాచెడ్డ కోపం. నా జోలికి ఎవరొచ్చినా ­  వూర్కొనేదాన్ని కాదు. ఎవరన్నా సరదాకి ఆటపట్టించినా కోపం వచ్చేసేది. నా వయసు పిల్లలెవరూ నాతో మాట్లాడే ధైర్యం కూడా చేసేవారు కాదు. చాలామంది నన్ను చూసి ‘ఆడపిల్లంటే ఇలా ఉండాలి’ అనేవారు. నా గురించి అమ్మకి ఏ బెంగా ఉండేది కాదు. పెళ్లి చేసి పంపితే ఎలా ఉంటుందో అని బాధపడేది అంతే!
తాతతో వెళ్లేదాన్ని: నాకోసం అమ్మ ఎంతో కష్టపడేది. ఆ పనీ ఈ పనీ చేస్తూ నన్ను పోషించేది. నేను కూడా పని లేకుండా ­వూరికే ఇంట్లో కూర్చోవడం ఎందుకు అని మాకున్న మేకల్నీ, గేదెల్నీ మేతకు తోలుకెళ్లేదాన్ని. ‘నీ ఒక్కదానికే భయం వేస్తుంది బిడ్డా’ అంటూ అమ్మ చాలా సార్లు వెళ్లొద్దంది. అయినా నేను వినిపించుకోలేదు. మా ఇంటి పక్కన తాత వెళుతుంటే నేనూ ఆయనతోపాటు ఉదయం వెళ్లి సాయంత్రానికి వచ్చేదాన్ని. ఆయనకి యాభై ఐదేళ్లకు పైనే ఉంటాయి. నేను ఆరోగ్యం బాగోలేక వెళ్లలేకపోయినా మా మేకలూ, గేదెల్నీ ఆయనే తోలుకెళ్లేవాడు. అమ్మ మీద అలిగి అన్నం తీసుకెళ్లకపోతే తాత తెచ్చుకున్న అన్నంలోనే నాకూ పెట్టేవాడు. ‘తినవే మనవరాలా’ అంటూ ప్రేమగా పెట్టేవాడు. కథలూ, ­వూర్లోని రకరకాల సంగతులు చెప్పేవాడు. పొలం వెళితే నాకు భలే పొద్దుపోయేది. మా తాతే బతికుంటే నన్ను ఇలానే చూసుకునేవాడు కదా అనిపించేది.
నేనే వినలేదు: ఆ తాత పొలంలో ఉన్నప్పుడు అలా ఉండేవాడు. ఇంటి దగ్గర పిలిచినా పలికేవాడు కాదు. తన మనవళ్లూ, మనవరాళ్లతోనే ఉండేవాడు.వూ­ళ్లొ అతనికి చాలామంచి పేరుంది. మా అమ్మ కూడా చిన్నాయనా, చిన్నాయనా అంటూ మంచిగా ఉండేది. అలా తాతతోపాటు ఒకటి కాదు, రెండు కాదు.. మూడేళ్లు వెళ్లా. పెద్దమనిషినయ్యాక అమ్మ వెళ్లొద్దంది కానీ నేనే వినలేదు. అలవాటు పడ్డాను కదా పొలం వెళ్లడానికి. పైగా అమ్మ మేకల్ని, పాలనీ అమ్మితే డబ్బులు బాగానే చేతికి వచ్చేవి. నేను వాటిని పొలం తీసుకెళ్లకపోతే అమ్మేయాల్సిన పరిస్థితి. వచ్చే డబ్బు అనవసరంగా పోతుందని నేనేే మొండిగా వెళ్లేదాన్ని.
అబద్ధం చెప్పాడు: ఒక రోజు తాత రోజూ వెళ్లే వైపు కాకుండా అడవి వైపు తీసుకెళ్లాడు. ఎందుకు అటు తాతా అంటే ‘ఆ దిక్కున మేత అయిపోయింది. ఇటు బాగా దొరుకుతుంది’ అని చెప్పాడు. తాత ఏం చెప్పినా నమ్ముతాను నేను. ఇక ఆ దిక్కుకు వెళుతున్నప్పట్నుంచీ అతను విచిత్రంగా ప్రవర్తించేవాడు. దగ్గరగా కూర్చోవడం, తన ఒళ్లొ కూర్చోబెట్టుకోవడం, గిచ్చడం, ముద్దుపెట్టుకోవడం, కొరకడం వంటివి చేసేవాడు. చిన్నపిల్లని కదా.. ప్రేమగా అలా చేస్తున్నాడు అనుకునేదాన్ని. అమ్మతో కూడా ఏం చెప్పేదాన్ని కాదు. ఒక రోజు ఒంటి మీద బట్టలు తీసేయమన్నాడు. నేను తీయను అనడంతో తనే లాగేసి అమాంతం మీద పడిపోయాడు. ­వూపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆ రోజంతా నీరసం.. ఒళ్లంతా నొప్పులు. పైగా ‘ఆడపిల్లలందరూ ఇలానే చేస్తారు. నువ్వు కూడా చెయ్యాలి. ఎవరికైనా చెబితే చచ్చిపోతావ్‌’ అన్నాడు.
నిజమని నమ్మా: పిచ్చిదాన్ని నాకేం తెలుసు. అలా చేయకూడదని. నిజంగా చచ్చిపోతానేమో అనుకుని అసలు ఎవరి దగ్గరా మాట్లాడేదాన్ని కాదు. ఆ తరవాత చాలాసార్లు అలా చేశాడు. రెండు మూడు నెలల తరవాత నుంచి నాకు నీరసంగా ఉండి పొలం వెళ్లాలనిపించేది కాదు. కానీ అలానే వెళ్లేదాన్ని. ప్రాణం బాగోట్లేదని అమ్మ నన్ను ఇంట్లోనే కొన్నాళ్లు ఉంచింది. ఒకరోజు విపరీతంగా కడుపునొప్పి. ఏడుస్తూ విలవిల్లాడుతుంటే తాండూరులోని ఓ పెద్దాసుపత్రికి తీసుకెళ్లింది. అప్పుడు తెలిసింది నేను ఆరో నెల గర్భ´వతిని అని. తాత నాతో చనువుగా, ప్రేమగా ఉండటం వల్లే నేను గర్భం దాల్చానని తెలిసి చచ్చిపోవాలన్నంత బాధ కలిగింది. వెంటనే కోపం ఉండబట్టలేక వెళ్లి నిలదీశాను. ‘నీ కడుపుకీ, నాకూ ఎలాంటి సంబంధం లేదు. ఎవడు చేశాడో వెళ్లు’ అని గెంటేశాడు. అతని కొడుకులూ, కోడళ్లూ మనవళ్లూ అందరూ చూస్తుండిపోయారు తప్ప ఎవరూ కలగజేసుకోలేదు. మా అమ్మేమో ‘ఎందుకు అలా వాడిని నిలదీసి పరువు బజారున పడేశావ్‌’ అంటూ కోప్పడింది. ­వూరంతా విషయం తెలిసింది. చాలామంది నా ముందే ‘రాణి కడుపు తెచ్చుకుందంట’ అని నా మీద తప్పు వేస్తూ మాట్లాడారు తప్ప ఎవరూ సమస్య ఏంటని అడగలేదు. ఎవరో ఇద్దరు ముగ్గురు ‘కేస్‌ పెట్టండి’ అని చెప్పారు అంతే. ఇంకొందరైతే ‘చెడిపోయిందంట..’ అని నా ముందే అన్నారు. వీళ్లందరి నోళ్లూ మూయించాలంటే తప్పు చేసిన వాడిని వాళ్ల ముందు నిలబెట్టాలి అనిపించింది.
కేసు పెట్టా: పరువు గురించి ఆలోచించలేదు. కేసు పెడితే పోలీసులే న్యాయం చేస్తారేమో అని అమ్మని బతిమాలి స్టేషన్‌కి తీసుకెళ్లా. అప్పుడు నాకు పదమూడేళ్లు. అమ్మ ఫిర్యాదు ఇచ్చినట్టుగా కాగితం రాశారు. వాళ్లూ రకరకాలుగా నన్ను ప్రశ్నలు అడుగుతుంటే చాలా అసహ్యంగా అనిపించింది. వాడిని బయటకు లాగాలంటే ఇవన్నీ పడాల్సిందే అనుకున్నా. పోలీసులు అతడిని అడిగితే తనకు సంబంధం లేదన్నాడు. ముందు అరెస్టు చేసినా బెయిల్‌ మీద బయటకు వచ్చాడు. ఆ తరవాత కేసును కోర్టుకు అప్పగించారు. వాయిదాలకోసం తిరుగుతూ ఉండేదాన్ని. ఇంతలో నాకూ కాన్పు అయ్యింది. మగపిల్లాడు పుట్టాడు. డీఎన్‌ఏ పరీక్ష కూడా చేశారు. అందులో బిడ్డకి తండ్రి వాడేనని తేలింది. కానీ తిండి సరిగ్గా లేక వెంటనే చనిపోయాడు. అప్పుడే న్యాయం నావైపే ఉంటుందని నమ్మకం కలిగింది. కానీ నా గురించి ఆలోచించిన అమ్మ అనారోగ్యం పాలైంది.
ప్రపంచం చూశా: ఆ తరవాత వాడి వల్ల నాకు ప్రాణభయం ఉంటుందని పోలీసులు ­వూహించారు. ఆ వూ­ర్లోనే ఉండటం వల్ల ఏదైనా ప్రమాదం కలగొచ్చని నన్ను హైదరాబాద్‌లోని కస్తూర్బా గాంధీ నేషనల్‌ మెమోరియల్‌ ట్రస్టుకు పంపారు. మొదట్లో అక్కడ ఉండాలంటే భయం వేసింది. కానీ అక్కడా నాలాంటి వాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లందర్నీ చూసి జాలేసింది. ధైర్యం కూడా వచ్చింది. అక్కడి నుంచే కోర్టుకు వెళ్లేదాన్ని. ట్రస్టువాళ్లు ఎంతో సాయం చేశారు. నాకు న్యాయం చేయాలనుకున్నారు. అక్కడ చదువుకోమని చాలామంది చెప్పారు. నాకు చదువు మీద పెద్దగా ఆసక్తి లేకపోయింది. వాళ్లకి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని వంట పనుల్లో సాయం చేసేదాన్ని. అన్యాయమైన ఆడవాళ్ల జీవితాలు ఎలా ఉంటాయో అక్కడ కళ్లారా చూశాను. అదేవిధంగా ధైర్యంగా న్యాయం కోసం ఎంతైనా పోరాటం చేయొచ్చు అనీ అర్థం చేసుకున్నా. ఒక్కసారిగా బయటి ప్రపంచం నాకు తెలిసింది. మనుషులూ, మనస్తత్వాలూ ఎలా ఉంటాయో అర్థమైంది. పలు సంఘటనల్ని కాళ్లారా చూశాక సమాజంలో ఎలా ఉండాలో తెలిసింది.
పదేళ్లు శిక్ష పడింది: నాలుగేళ్ల తరవాత.. గతనెల మా ­వూర్లో అందరి ముందూ నేను గర్వంగా తిరిగేలా కోర్టు తీర్పు ఇచ్చింది. వాడిని పదేళ్లు జైల్లో ఉంచాలన కోర్టు తీర్పు వచ్చింది. ‘నేను కాదు నీకు కడుపు చేసింది’ అన్నవాడు తలదించుకుని వెళుతుంటే ఎంతో సంతోషంగా అనిపించింది. నేను ఏ తప్పూ చేయలేదని అందరికీ తెలిసింది. మా ­వూళ్లొ వాళ్లు కూడా ఆడపిల్ల అంటే రాణిలా ఉండాలి అని పొగుడుతున్నారు. ఇప్పుడు మా అమ్మ ఆరోగ్యం బాగు చేయించి.. నేను ఎక్కడైనా పనికి కుదిరి తనని చూసుకోవాలి. నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. నేను ఆడపిల్లలకు ఒకటే చెప్పాలని అనుకుంటున్నా. అన్యాయం జరిగితే నోరు విప్పండి. పరువు అని కూర్చుంటే తప్పు చేసినవాళ్లని ప్రోత్సహించిన వాళ్లమవుతాం. అలాంటివి మనం బయటకు తీసుకొస్తేనే... తప్పు చేయడానికి భయపడతారు. పోరాటం చేస్తే పోయేదేముండదు...

No comments:

Post a Comment