Saturday 28 January 2017

అలసిపోతున్నారా.. మానసికంగా?

అలసిపోతున్నారా.. మానసికంగా?
చాలామంది శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నా.. ఎప్పుడూ అలసిపోయినట్టు కనిపిస్తుంటారు. సెలవు తీసుకుని ఇంట్లోనే కూర్చున్నా ఆ పరిస్థితి మారదు. దీనికి మానసిక అలసట కారణం కావొచ్చంటారు నిపుణులు. మనకొచ్చే 90 శాతం ఒత్తిడి-ఆధారిత అనారోగ్యాలకు కారణం ఇదేనంటారు. ఉద్యోగినిగా దాని బారినపడకుండా ఉండాలంటే..
తీరు మార్చండి.. : ప్రతి రోజూ ఒకే దినచర్య, ఆఫీసులో ఒకేరకం పని.. ఈ మూసజీవితమే మానసిక అలసటకి ప్రధాన కారణం. ముందు అందులో నుంచి బయటపడాలి. చిన్నచిన్నవాటితో మొదలుపెట్టాలి. ప్రతిరోజూ బస్సులో ఒకే మార్గంలో వెళ్తున్నవాళ్లు కాస్త వీలైతే మోటారు సైకిలుపై పోవచ్చు. రోజూ స్కూటీలో వెళ్తున్నవారు కాస్త దారి మార్చి ప్రయాణం చేయొచ్చు. విధి నిర్వహణలోనూ రోజూ చేసే పనినే కాస్త భిన్నంగా ప్రయత్నించి చూడండి.
అహానికి ముడిపెట్టొద్దు : ఉద్యోగంలో ఈరోజు ఒక పని ముగించాలని అనుకుంటున్నారు! దాన్ని మీ అహానికి ముడిపెట్టకండి. అంటే ఆ పని సాధించడాన్ని మీ వ్యక్తిగత విజయంగా.. కాకపోవడాన్ని ఓటమిగా అనుకోకండి. వందశాతం అంకితభావంతో పనిచేయండి. ఫలితంతో పనిలేకుండా అందులో నుంచి బయటపడండి. మరో కొత్త పని ఉత్సాహంగా మొదలుపెట్టండి. మానసిక ఒత్తిడిని అలా తగ్గించుకోవచ్చు.
రాయండి : మిమ్మల్ని చికాకుపెడుతున్న, ఒత్తిడి తెప్పిస్తున్న అంశాలను ఓ చోట రాయండి. ఇది మనసుకి ఉత్తేజాన్నిస్తుంది. అంతమాత్రాన ప్రతిరోజూ తప్పకుండా రాసితీరాలని అనుకోవద్దు. అది మరో రకం ఒత్తిడిగా మారుతుంది. మీకు వీలున్నప్పుడే.. మనసుకి తోచినప్పుడే రాయండి చాలు!

ఈ కిటుకులు తెలుసా..

ఈ కిటుకులు తెలుసా..
ప్రత్యేక సందర్భాల్లోనే కాదూ.. రోజూ ఎంతో కొంత అలంకరణ చేసుకోవడం కూడా ఇప్పుడు మామూలైపోయింది. మరి మనం చేసుకునే అలంకరణ వల్ల కాస్త యౌవనంగా కనిపించాలంటే ఎలాంటి కిటుకులు పాటించాలో చూద్దాం.
ముఖాన్ని శుభ్రం చేసుకున్న వెంటనే చర్మానికి సరిపోయే ఫౌండేషన్‌ని గబగబా రాసేసుకుంటారు కొందరు. అంతకన్నా ముందు మీ ముఖానికి కాస్త మాయిశ్చరైజర్‌ పట్టించండి. లేదంటే ఫౌండేషన్‌లో ఉన్న తేమను మీ ముఖం పీల్చేసుకుని సన్నని ముడతల్లాంటివి ఉంటే కాసేపటికి కనిపిస్తాయి.
కళ్ల అడుగున నల్లని వలయాలూ, చర్మంపై అక్కడక్కడా ఉన్న మచ్చల్ని కనిపించకుండా చేసేందుకు చాలామంది ఫౌండేషన్‌నే వాడుతుంటారు. కానీ దానికి బదులుగా కన్సీలర్‌ రాయండి. అవి కనిపించకుండా ఉంటాయి.
కాస్త పెద్దవారయితే మీరు పౌడర్‌ని వీలైనంత తక్కువగా రాసుకోవాలి. అది ముడతల్లో చేరి, అవి ఇంకా స్పష్టంగా కనిపించొచ్చు.
పెదవులకు లిప్‌స్టిక్‌ అంతా రాసుకున్నాక... కొద్దిగా పెట్రోలియంజెల్లీని కింది పెదవి మధ్యలో అద్దండి. దీనివల్ల రంగు ఎక్కువసేపు ఉండటమే కాదు.. పెదవులూ నిండుగా, యౌవనంగా కనిపిస్తాయి.