Sunday 29 January 2017

టాపులేసిపోద్ది.. వేసుకున్నామంటే!

టాపులేసిపోద్ది.. వేసుకున్నామంటే!
‘గౌనా.. జీన్సా..’ ‘గాగ్రానా.. స్కర్టా..’ కొత్త సంవత్సరాన్ని స్వాగతించే వేడుకల్లో.. ఏది వేసుకుంటే బాగుంటుందని ఆలోచిస్తున్నారు కదూ..! ముందు మీ అల్మారా తెరవండి.. అందులోంచి.. ఈ కింది దుస్తుల్లో ఏదో ఒకదాన్ని బయటకు తీసి సిద్ధంగా పెట్టుకోండి.. ఎందుకంటే.. ఈ సందర్భానికి వేసుకునే దుస్తులు కాస్త భిన్నంగా ఉంటేనే అందమంటున్నారు డిజైనర్‌ పైడి స్వప్న.
మిగిలిన వేడుకలతోపోలిస్తే.. నూతన సంవత్సర వేడుకల్లో ఉండే జోరే వేరు. ఈ సందర్భానికి సంప్రదాయం దుస్తులకన్నా.. పాశ్చాత్య వస్త్రశ్రేణిని ఎంచుకుంటేనే బాగుంటుంది. అలాని జీన్స్‌ టీషర్టులు మాత్రం కాదు. గౌనులు, స్కర్టులతో తళుక్కుమనడమే అందం. వాటిల్లోనూ భిన్నంగా కనిపించే ప్రయత్నం చేయాలి. అప్పుడే కొత్తగా కనిపిస్తారు. కాబట్టి ఈసారి కాస్త భిన్నంగా ఒంటికి అతుక్కుని ఉండే (బాడీకాన్‌) దుస్తులు ఎంచుకుని చూడండి. ఇప్పుడు ఇవే ఫ్యాషన్‌ మరి. వీటిల్లో మీ అభిరుచీ, వయసునీ బట్టి ఎంచుకునే దుస్తులు మోకాలి వరకా లేదా నేలను తాకేలా ఉండాలా అనేది నిర్ణయించుకోవచ్చు. పాతికల్లోపువారికి మోకాలి వరకూ ఉండేవే నప్పుతాయి. మోకాళ్ల వరకూ ఉండే నల్లటి గౌన్‌లు చక్కని ఎంపిక. ఆ వయసుదాటిన వారు పొడవాటి గౌన్లకు ప్రాధాన్యం ఇస్తే మంచిది. బాడీకాన్‌లోనే మినీలు, హైవెయిస్టెడ్‌ స్కర్ట్‌లు, ప్యాంట్‌లను ఎంచుకోవచ్చు. మరీ ఇలా ఒంటికి అతుక్కునేవి కట్టుకోలేం అనుకునేవారికి క్రాప్‌టాప్‌లూ, ఎయిర్‌లైన్‌ కట్స్‌ ఉన్న గౌనుల్ని ఎంచుకోవచ్చు. ఇంకా ఆధునికంగా కనిపించాలని అనుకుంటే చేతుల్లేని స్లీవ్‌లెస్‌ ఇకత్‌ క్రాప్‌టాప్‌, రాసిల్క్‌తో రూపొందించిన పొడవాటి స్కర్టులు ప్రయత్నించొచ్చు. మరీ సన్నగా ఉండేవారికి ఇవి బాగుండవు. కాబట్టి బ్రొకేడ్‌ జార్జెట్‌ కుర్తీలు ఎంచుకోవచ్చు. దీనికి జతగా పలాజో ప్యాంట్లూ, స్కర్టులూ వేసుకోవచ్చు. కుచ్చిళ్లు ఎక్కువగా ఉండే కుర్తీ స్కర్టులూ చక్కగా నప్పుతాయి. హైవెయిస్టెడ్‌ స్కర్ట్‌లూ. ఓ ఎగుడుదిగుడు డిజైన్‌ గౌనులు, పొడవాటి మ్యాక్సీలను ఎంచుకోవచ్చు. అయితే వీటికి నప్పేలా చెవులకు మెరిపించే దిద్దులను పెట్టుకోవడం మరచిపోవద్దు
ఎత్తుమడమలే అందం..
రాత్రిపూట జరిగే ఈ వేడుకల్లో నలుపూ, ఎరుపు రంగులకు ప్రాధాన్యం ఇస్తే మంచిది. ఇవి వద్దనుకుంటే బంగారూ, వెండి రంగుల్లో సీక్వెన్లున్న దుస్తులు బాగుంటాయి.
ఒంటికి అతుక్కునే దుస్తులు ఎంచుకున్నప్పుడు పెన్సిల్‌ హీల్స్‌ (ఎత్తుమడమల చెప్పులు) వేసుకుంటేనే అందం. వీటికి జతగా పెద్దపెద్ద చెవిపోగులు అదరహో అనిపిస్తాయి.
పొడవాటి హ్యాండుబ్యాగు కన్నా.. చేతిలో క్లచ్‌ పర్సు ఉంటేనే అందం.
మీరు వేసుకునే చొక్కా, టీషర్టూ, క్రాప్‌టాప్‌.. ఏదయినా సరే.. వీపులేని(బ్యాక్‌లెస్‌), మెడభాగం తక్కువగా ఉన్నది (లోనెక్‌) ఉండేలా చూసుకోవాలి.
పైన చెప్పిన డిజైన్లను ప్రయత్నించలేము అనుకునేవారు ఎయిర్‌లైన్‌ తరహా గౌనుని వేసుకెళ్లొచ్చు. ఇంకా ఫ్యాషన్‌గా కనిపించాలనుకుంటే క్రష్డ్‌ వెల్వెట్‌లో మినీ స్కర్ట్‌, మ్యాక్సీలను వేసుకోవచ్చు. క్రాప్‌టాప్‌కి జతగా పెప్లమ్‌ స్కర్ట్‌నీ ప్రయత్నించొచ్చు.
ఎక్కువ మెరుపులు వద్దు.. 
ఇక కొత్త సంవత్సరం మొదటి రోజునా మెరిసిపోవాలని భావిస్తారంతా. అలాంటప్పుడు అనార్కలీలు బాగుంటాయి. అలానే పొట్టపైకి ఉండే స్కర్టు (హైవెయిస్టెడ్‌)ని క్రేప్‌, జార్జెట్‌ల్లో ఎంచుకోవచ్చు. దీనికి జతగా టీషర్టు వేసుకుని ఇన్‌షర్ట్‌ చేసుకుని చూడండి.
బ్రొకేడ్‌ వస్త్రంలో బాక్స్‌ప్లీటెడ్‌ స్కర్టు పార్టీలుక్‌ని ఇస్తుంది. అయితే ఆ మెరుపులు మరీ భారీగా లేకుండా చూసుకోవాలి. అలాగే జార్జెట్‌లో ఫ్రంట్‌ సీ కట్‌తో స్కర్టు వేసుకున్నా కొత్తగా కనిపించొచ్చు. ఇవన్నీ పగటి పూట వేసుకుంటాం కాబట్టి ముదురు ఎరుపూ, గులాబీ, తెలుపూ, నీలం రంగుల్లో ఉండేలా చూసుకోవాలి.
ఈ దుస్తులకు పొడవాటి పట్టీలుండే పెద్ద హ్యాండ్‌బ్యాగ్‌లే అందం. ఓ మోస్తరు ఎత్తున్న చెప్పులు వేసుకుంటే చాలు.

No comments:

Post a Comment