Thursday 26 January 2017

వేపతో చుండ్రు దూరం!

వేపతో చుండ్రు దూరం!
వాతావరణంలో తేమ, తల్లో జిడ్డు... వంటివన్నీ చుండ్రుకి దారితీస్తాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి..
వేపలోని యాంటీ ఫంగల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు చుండ్రును తగ్గించడమే కాదు, దురదా, జుట్టు రాలే సమస్యనూ నివారిస్తాయి. గుప్పెడు వేపాకుల్ని కప్పు నీళ్లలో వేసి మరిగించాలి. చల్లారాక ఆ నీటితో జుట్టును కడిగేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే చుండ్రు తగ్గుతుంది.
కొబ్బరినూనెలో యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. రెండొంతుల కొబ్బరినూనె, ఒకవంతు నిమ్మరసం కలిపి మాడుకు రాసి, మర్దన చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
పావుకప్పు ఆలివ్‌నూనెని గోరువెచ్చగా చేసి తలకు పట్టించి మర్దన చేయాలి. అరగంట తర్వాత షాంపూతో కడిగేసుకోవాలి. రాత్రి నిద్రపోయేముందు తలకు రాసుకుని ఉదయాన్నే తలస్నానం చేసినా సరిపోతుంది.
టీ ట్రీ నూనెలోనూ యాంటీ ఫంగల్‌ గుణాలుంటాయి. మీరు వాడే షాంపూలో కొన్ని చుక్కల టీట్రీ నూనెని కలిపి తలకు రాసుకుని కాసేపయ్యాక తలస్నానం చేసుకుంటే సరిపోతుంది. లేదంటే కొన్ని చుక్కల టీ ట్రీ నూనెని కొబ్బరినూనె లేదా ఆలివ్‌ నూనెతోనూ కలిపి రాసుకోవచ్చు. రాత్రి పడుకునే ముందు తలకు రాసుకుని ఉదయాన్నే షాంపూ చేసుకున్నా ఫలితం ఉంటుంది.
మెంతుల్లోని గుణాలు చుండ్రు సమస్యను తగ్గించడమే కాదు.. జుట్టునూ మృదువుగా ఉంచుతాయి. మూడు చెంచాల మెంతుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే ముద్దలా చేయాలి. దీనికి నాలుగు చెంచాల పెరుగు కలిపి తలకు పట్టించాలి. రెండు గంటల తర్వాత తలస్నానం చేయాలి.

No comments:

Post a Comment