Friday 27 January 2017

ఫేస్‌బుక్‌లో ఇలా పంచొద్దు..

ఫేస్‌బుక్‌లో ఇలా పంచొద్దు..
అవీఇవీ అనికాకుండా ఇప్పుడన్నీ ఫేస్‌బుక్‌లో పంచుకుంటున్నాం. మనం. పిల్లల ఫొటోలకైతే అసలు అడ్డే ఉండటం లేదు! వాళ్ల ప్రతి ముచ్చటనీ ఫేస్‌బుక్‌లో టపా పెట్టేస్తున్నాం. ఇందువల్ల కొందరు అసాంఘిక శక్తులకు మన పిల్లలకు సంబంధించిన ప్రతి వివరాలనూ అందిస్తున్నామని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
అవి అక్కర్లేదు : మీ పాపా, బాబూ యూనిఫాంతో బడికెళ్లే ఫొటోలు తన ఐడీ కార్డూ, బ్యాడ్జ్‌లు కనిపించేలా ఉన్న ఫొటోలు అసలు పెట్టకండి. మీ ఇంటి నెంబర్‌ ప్లేటూ, వీధి పేర్లు కనిపించేలా పెట్టే చిత్రాలూ వద్దు. ఇన్ని గంటలకి బడికెళుతుంది.. వస్తుంది వంటి వివరాలు పెట్టకండి. ఈ సమాచారం కొందరు నేరస్థుల చేతికెళితే ప్రమాదం.
అందరికీనా? : పిల్లల ఫొటోలు అందరికీ కాకుండా కేవలం మీకు బాగా తెలిసిన స్నేహితుల ఫేస్‌బుక్‌ ఖాతాల్లో మాత్రమే కనిపించేలా సెట్‌ చేసుకోండి. అంటే ‘పబ్లిక్‌’ అని కాకుండా ‘క్లోజ్‌ ఫ్రెండ్స్‌’ అన్నవాళ్లకి మాత్రమే ఆ ఫొటోలు కనిపించాలన్నమాట.
అసలొద్దు : పిల్లలు స్నానం చేసేప్పుడు అల్లరల్లరిగా అందంగా ఉంటారు! కానీ ఏ పరిస్థితుల్లోనూ అలాంటివి పంచుకోకండి. ఫేస్‌బుక్‌లో తప్పుడు వీడియోలూ, ఫొటోలూ పంచేవాళ్ల దృష్టిని ఇవి ఆకర్షించే ప్రమాదముంది. మీ పిల్లలు కాస్త పెద్దవాళ్లైతే వాళ్లకీ ఇవి ఇబ్బందే!
పేర్లు అలా వద్దు : ఫేస్‌బుక్‌లో పిల్లల ముద్దుపేరూ, పూర్తిపేరూ వాడటం రెండూ మంచిదికాదు. మొదటిది మీ పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది. తన సహాధ్యాయులు ఎవరైనా చూసి అదే పేరుతో పిలిస్తే చిరాగ్గా ఉంటుంది. ఇక పూర్తిపేరు వాడటం వాళ్ల భద్రత దృష్ట్యా మంచిదికాదు. తన పేరు ప్రస్తావించకపోవడమే మంచిది.
వేడుకలప్పుడు : ఏదైనా కార్యక్రమంలో మీ పిల్లలతోపాటూ వాళ్ల స్నేహితులూ వస్తుంటారు. అలాంటి ఫొటోలు అసలు పెట్టకండి. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలు ఫేస్‌బుక్‌లోకి రావడం ఇష్టం ఉండదు. అంతగా తప్పదనిపిస్తే.. వాళ్ల అనుమతి తీసుకున్నాకే ఫొటోలు పంచుకోండి. మీ పాప విషయంలోనూ ఇతరులు అనుమతి తీసుకోవాలని కచ్చితంగా చెప్పండి.

No comments:

Post a Comment