Thursday 26 January 2017

పట్టులాంటి జుట్టుకు కలబంద!

పట్టులాంటి జుట్టుకు కలబంద!
జుట్టుకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా కలబందతో తగ్గించుకోవచ్చు. చుండ్రూ, జుట్టు పొడిబారడం, జీవం కోల్పోవడం, రాలిపోవడం వంటి సమస్యల్ని నివారించేందుకు కలబందను ఎలా వాడొచ్చో చూద్దాం.
లస్నానం చేయడానికి పదినిమిషాల ముందు కలబంద గుజ్జును కుదుళ్లతో సహా పట్టించాలి. ఈ గుజ్జులోని ఎంజైములు తల్లోని మృతకణాలని తొలగించి చుండ్రుకు కారణమయ్యే ఫంగస్‌ని తొలగిస్తాయి. పీహెచ్‌ స్థాయిలని క్రమబద్ధీకరించి తగినంత తేమను అందించి జుట్టు పొడిబారకుండా చేస్తాయి. అలాగే పావుకప్పు కలబంద గుజ్జులో రెండు పెద్ద చెంచాల పెరుగూ, పెద్ద చెంచా తేనె, రెండు చెంచాల ఆలివ్‌నూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లనుంచీ జుట్టంతా పట్టించాలి. ఇరవై అయిదు నిమిషాల తరవాత కడిగేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాదు, జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది.
సాధారణంగా జుట్టు కుదుళ్ల నుంచి వెలువడే సహజసిద్ధమైన నూనెల్లో ప్రత్యేక అమినోఆమ్లాలు ఉంటాయి. అవే జుట్టు ఎదుగుదలకీ, ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి. అవే ఆమ్లాలు కలబందలోనూ అధికంగా ఉంటాయి. అందుకే క్రమంగా తప్పకుండా దీన్ని రాసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తుగానూ పెరుగుతుంది. పొడిబారే సమస్య కూడా అదుపులో ఉంటుంది
రెండు చెంచాల నానబెట్టిన శీకాయపొడిలో కొద్దిగా తేనె, పావుకప్పు కలబంద గుజ్జు కలిపి దాన్ని తలకు పట్టించాలి. ఆరిన తర్వాత కడిగేస్తే జుట్టు పట్టుకుచ్చులా, ఒత్తుగా కనిపిస్తుంది. జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది.
తాజాగా తీసిన అర కప్పు కలబంద గుజ్జుకి, పెద్ద చెంచా ఆముదం, చెంచా మెంతిపిండి కలిపి రాత్రంతా నానబెట్టాలి. తెల్లారాక దాన్ని తలకు పట్టించి గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా ప్రతి వారం చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
రెండు చెంచాల ఎర్రమందార పూల గుజ్జుని పావుకప్పు కలబంద గుజ్జుతో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. జుట్టు పొడిబారకుండా ఉంటుంది. రాలడం కూడా తగ్గుతుంది.
కలబంద గుజ్జూ, ఆలివ్‌ నూనె సమపాళ్లలో తీసుకుని కలపాలి. దీన్ని తలంతా రాసుకుని అరగంట తరవాత తలస్నానం చేయాలి. ఇది కండిషనర్‌లా పనిచేసి జుట్టుకు పోషణ అందిస్తుంది.

No comments:

Post a Comment