Friday 27 January 2017

సోషల్‌ మీడియా వదలట్లేదా

సోషల్‌ మీడియా వదలట్లేదా

నేటి యువతకు సోషల్‌ మీడియాతో అనుబంధం అంతా ఇంతాకాదు... ప్రతిక్షణాన్నీ, ప్రతి సందర్భాన్నీ ఒడిసి పట్టుకుని...పోస్ట్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు. నిజానికి అది ఆసక్తి అయితే ఫరవాలేదు కానీ.. వ్యసనంగా మారితేనే సమస్య. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం!
స్మార్ట్‌ఫోన్లు చేతిలోకి వచ్చాక క్షణక్షణం అప్‌డేట్లు చూడటం ఓ అలవాటుగా మారిపోయింది. దాంతో సమయం వృథా అయిపోతుంది. అందుకే రోజులో కొంత సమయం మాత్రమే ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ చూసుకోవడానికి ప్రణాళిక వేసుకోవాలి. ఆ సమయంలో మాత్రమే చూడాలి. అలాగే రోజులో కొంత సమయం డేటాను కట్టేయాలి. దాంతో ఫోను కేవలం మాట్లాడేందుకూ, సందేశాలు చూడటానికి మాత్రమే పరిమితం అవుతుంది.
వారంలో ఒకరోజు సోషల్‌ మీడియా జోలికి వెళ్లను అనే నియమం పెట్టుకోవాలి. నిజానికి అలా దూరంగా ఉన్న తరవాత సోషల్‌ మీడియాని చూస్తే ఆసక్తిగా అనిపిస్తుంది. బోలెడు ఆప్‌డేట్లూ, సమాచారం ఉంటుంది. ఒకేసారి అన్ని చూసుకోవచ్చు.
ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌లో అప్‌డేట్లకు సంబంధించి చాలామంది సంక్షిప్త సందేశంలో నోటిఫికేషన్‌ వచ్చేలా పెట్టుకుంటారు. అది ఏ మాత్రం సరికాదు. అలా సందేశం వచ్చినప్పుడు తెలియని ఉత్సుకత ఇబ్బంది పెడుతుంది. ఒత్తిడిని కూడా పెంచుతుంది. అందుకే అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకోవాలి.
కొందరు చుట్టుపక్కల మనుషులున్నా పట్టించుకోకుండా చాటింగ్‌లూ, పోస్టింగులతో కాలం గడుపుతుంటారు. కానీ అందరి మధ్యలో ఉన్నప్పుడు సరదాగా కబుర్లు చెప్పడం, లోకాభిరామాయణం, మంచీ చెడులు మాట్లాడుకోవడం వల్ల మానవ సంబంధాలు మెరుగుపడతాయి. కాబట్టి నలుగురి మధ్యలో ఉన్నప్పుడు ఫోను జోలికి వెళ్లకుండా దాన్ని సైలెంట్‌లో పెట్టేయడం మంచిది.
ఒక్కోసారి ఒంటరితనం కూడా పోషల్‌ మీడియాకు బానిసను చేస్తుంది. అలాంటి వారు స్నేహితులతో కలవడం.. ఆఫీసు విషయాల మీద దృష్టి పెట్టడం, కుటుంబ సభ్యులతో ఫోన్‌ మాట్లాడుకోవడం వంటివి చేయాలి. అలానే కొత్తకొత్త వంటల్లో ప్రయోగాలు చేయడం, సినిమాలు చూడటం, మొక్కల పెంపకం, పుస్తకాలు చదవడం, షాపింగ్‌, సాహితీపరమైన బ్లాగులు చదవడం లాంటివి చేయాలి. అంతేకాదు మనల్ని మనం అప్‌డేట్‌ చేసుకోవడంలో భాగంగా ఏదైనా కొత్త కోర్సులోనూ చేరవచ్చు.

No comments:

Post a Comment